ఈనెల 11న కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. కృష్ణా జలాలపై పోరుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిద్ధమయ్యాయి. కేఆర్ఎంబీ సమావేశానికి రెండు రాష్ట్రాలు తమ ఎజెండాలను అందజేశాయి. వాటిపై బోర్డు కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ ఎజెండాలో.. కృష్ణా జలాల్లో 50 శాతం వాటాను ప్రధానంగా పేర్కొనగా.. గోదావరి జలాల మళ్లింపుతో నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకునే వెసులుబాటున్న 45 టీఎంసీల నీటిని తెలంగాణ కేటాయించుకోవడం చెల్లదని ఏపీ ప్రస్తావించింది.
అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారంటూ రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపాయి. ఏపీకి బోర్డు తరలింపు, నిర్వహణకు రెండు రాష్ట్రాల నిధుల కేటాయింపు, అదనపు సిబ్బంది తదితర అంశాలు కూడా ఉండనున్నాయి. ఏపీ చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ పనులను నిలిపివేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుండగా.. ఏపీ జాబితాలో.. ‘పాలమూరు, సుంకేశుల, 45 టీఎంసీల మళ్లింపు’పై అభ్యంతరాలు ఉన్నాయి.