గత ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి మంత్రి కేటీఆర్ కొడంగల్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గానికి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో కట్టిన గుడి, బడి తప్ప.. మండల కేంద్రంలో కనీసం జూనియర్ కళాశాలను కూడా నిర్మించలేదన్నారు.
బీఆర్ఎస్ కొడంగల్ ప్రజలను మోసం చేయాలని భావిస్తుందన్నారు. జిల్లాలు పెంచి కొడంగల్ ని ముక్కలు చేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తాను కొడంగల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు దరఖాస్తు కూడా చేసుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు. అలాగే 4 వేల పెన్షన్, ఇల్లు కట్టుకునే పేదలకు ఐదు లక్షలు, గ్యాస్ సిలిండర్ 500 కే అందిస్తామని పేర్కొన్నారు.