అభివృద్ధిలో తెలంగాణ, హైదరాబాద్‌లు అన్‌స్టాపబుల్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దీన్ని మోదీ, అమిత్ షా ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రగతి చక్రం ఆగదన్న మంత్రి.. అడ్డువస్తే జగన్నాథ రథచక్రాల్లా తొక్కుకుంటూ ముందుకు పోవడమేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమకు పోటీ కాంగ్రెస్‌తోనేనని, అయితే అది కూడా రెండోస్థానంలో.. చాలా దూరంలో ఉందన్నారు. బీజేపీ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ, సమాజంలో తక్కువ అని అభిప్రాయపడ్డారు.
‘బీజేపీ పైపైన బిల్డప్ తప్ప ఏమీ లేదు. కాంగ్రెస్ కూడా ఆ పార్టీ అధ్యక్షుడి వ్యవహారం వల్ల నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. పార్టీలో సీనియర్లకు గౌరవం లేదు. నేను ఐపీఎస్‌ను, మిగిలిన వాళ్లు హోంగార్డులని అధ్యక్షుడే అన్నారు. అలాంటి చోట సీనియర్లు ఉండటం దురదృష్టకరం. గతంలో ఆ పార్టీకి 19 సీట్లు వచ్చాయి. ఈ సారి అవి కూడా రావు.’ అని కేటీఆర్ అన్నారు.