రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అవకాశం దొరికిన ప్రతిసారి తనలో ఉన్న క్రీడాకారుణ్ని బయటకు తీస్తూ ఉంటారు. ఇప్పటికే పలుమార్లు తనలో ఉన్న క్రికెటర్, బాస్కెట్ బాల్ ప్లేయర్‌ని మనకు చూపించిన కేటీఆర్ తనలో ఉన్న షటిల్ స్టార్‌ను కూడా చూపించారు. తాజాగా కేటీఆర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పర్యటించారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో హుస్నాబాద్‌కు చేరుకున్న కేటీఆర్…. అక్కడి మినీ స్టేడియానికి చేరుకున్నారు. మొత్తం 27కోట్ల 51లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్టీ మహిళా వసతి గృహం, టీటీసీ సెంటర్, బస్తీ దవాఖానా, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మంత్రి ప్రారంభించారు. అలాగే.. రూ.3కోట్ల50 లక్షలతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పట్టణంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రి ప్రారంభించారు. కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించిన కేటీఆర్…. ఈ సందర్భంగా షటిల్ ఆడి సందడి చేశారు.