శారీరక శ్రమ లేకపోవడం వల్లే బిపి, షుగర్ లాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో నేషనల్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అవయవదానానికి ముందుకు వచ్చిన వారిని మంత్రి హరీష్ రావు సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవయవదాతల్లో పేదలు ఉంటే.. ఉచిత చదువు, ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. అందరూ ముందుకు వచ్చి అవయవ దానాలను ప్రోత్సహించాలని చెప్పారు. ఒకరి అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ కలుగుతుందని అన్నారు. త్వరలోనే గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి బ్లాక్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. ఇప్పటివరకు 3, 180 మంది అవయవాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.