ఇల్లు లేక మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలు కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. ఆమెకు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మీడియాలో వచ్చిన కథనానికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్ పల్లిలో ఏరుల్ల మల్లమ్మ అనే వృద్ధురాలు పేదరికంతో మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటుంది. 20 ఏల్ల క్రితం తన భర్త మరణించడంతో నానా కష్టాలు పడి ఇద్దరూ కూతుర్ల పెళ్లిళ్లు చేసింది.
15 ఏళ్ల కిందట శిథిలావస్థలో ఉన్న తన ఇల్లు భారీ వర్షాలకు కూలిపోవడంతో అదే స్థలంలో ఓ చిన్న గుడిసె వేసుకుంది. ఎనిమిదేళ్ల కిందట అది కూడా పడిపోవడంతో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ప్రభుత్వం కట్టించిన మరుగుదొడ్డిలోనే ఆమె జీవనం సాగిస్తుంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఇల్లు కట్టిస్తామని చెప్పిందే తప్ప చేసింది లేదని ఆ వృద్ధురాలు వాపోయింది. మల్లమ్మ విషాద గాదను ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆమెను పరామర్శించడంతో పాటు ఆమె క్షేమం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.