రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇదివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గౌరవ వేతనం ఇస్తామని పలుమార్లు ప్రకటించిన ఇప్పటికీ ఇవ్వడం లేదని రేషన్ డీలర్లు సమ్మెబాట పట్టారు. అయితే రేషన్ డీలర్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేషన్ డీలర్లకు నెలకి ఐదారు వేలకు మించి రావట్లేదన్నారు. నేనొక దోరని… అందరూ నా మోకాళ్ళ దగ్గర ఉండాలి అనేలాగ కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్.
గంగుల కమలాకర్ కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి అని.. రేషన్ డీలర్ల సమస్యలు ఆయన అర్థం చేసుకోవాలని సూచించారు. రేషన్ డీలర్లు కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేశారని అన్నారు. ప్రభుత్వం మంకుపట్టుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రేషన్ డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రేషన్ డీలర్లకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందన్నారు.