నేడు మల్లన్నసాగర్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం

-

కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల‌లో మ‌రొక కీల‌క ఘ‌ట్టానికి ముహుర్తం ఆస‌న్న‌మైంది. తెలంగాణ జ‌ల‌కిరీటంగా భాసిల్లే మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌ను ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఇవాళ ప్రారంభించనున్నారు. కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కంలోని అన్ని జ‌లాశ‌యాల కంటే మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ అతి పెద్ద‌ది. అత్యంత ఎత్తున ఉన్న జ‌లాశ‌యంగా గుర్తింపు పొందింది. భారీ మ‌ట్టిక‌ట్ట‌తో 50 టీఎంసీల సామ‌ర్థ్యంతో నిర్మించారు. 11 కంపెనీలు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. సుమారు 7వేల మంది కార్మికులు ప్ర‌తినిత్యం మూడు షిప్టుల్లో ప‌ని చేసి జలాశ‌యం క‌ల‌ను సాకారం చేసారు.

గంధ‌మ‌ల‌, కొండ పోచ‌మ్మ‌, బ‌స్వాపూర్ రిజ‌ర్వాయ‌ర్ల‌కు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ద్వారానే నీటిని పంపుతారు. నిజాం సాగ‌ర్‌, సింగూరు, ఘ‌న‌పూర్ ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ కూడా ఈ జ‌లాశ‌యంపైనే ఆధార‌ప‌డి ఉంది. డ్యామ్ ప్రోటోకాల్ అనుస‌రించి ఇప్ప‌టికే నీటి నిలువ సామ‌ర్థ్య ప‌రీక్ష‌లు విజ‌య‌వంతమ‌య్యాయి. ఈ జ‌లాశ‌యం ద్వారా దాదాపు 15, 71,050 ఎక‌రాలకు సాగునీరు అంద‌నున్న‌ది. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల తాగునీటి కోసం 30 టీఎంసీలు భ‌విష్య‌త్‌లో స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. పారిశ్రామిక అవ‌స‌రాల‌కు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి జ‌లాలు అందించ‌నున్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో భాగంగా సిద్ది పేట జిల్లాలో నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్‌ను సీఎం కేసీఆర్ ఇవాళ జాతికి అంకితం చేయ‌నున్నారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ పంపుహౌస్‌లో మోటార్ల‌ను ఆన్ చేసి నీటిని ఎత్తిపోసే ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తారు కేసీఆర్‌. ఆ త‌రువాత కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని వివిధ ఫ్యాకేజీల‌లో ప‌నుల పురోగ‌తిపై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news