పత్తి విత్తనాలు ఈ ధర కంటే ఎక్కువ అమ్మితే చర్యలే

వానాకాలం పంటకు సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డిలు వ్య‌వ‌సాయ‌, పోలీసు శాఖ ఉన్నతాధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రధాన రంగంగా గుర్తించిందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే దాని అనుబంధ రంగాలు బలోపేతమై రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని మంత్రి అన్నారు. ఇందులో భాగంగానే ఉచిత కరెంటు, నీళ్లు, రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోళ్లతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రధానంగా విత్తనాలు విత్తే సమయంలో నకిలీ విత్తనాలతో రైతాంగం నష్టపోకూడదన్నది ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం చేసారు.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కంపెనీలు నాణ్యమైన విత్తనాలనే అమ్మాలని, నాణ్యత లేని వాటిని విత్తనాల కింద తిరస్కరించిన వాటిని తిరిగి మళ్లీ వాడాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా లేని విత్తనాలను పశువులకు దాణా కింద మార్చి వాడుకోవాలన్నారు. కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చర్యల కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ పత్తికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని, ఈ వానాకాలం 70 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు. 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ కు కేంద్రం గరిష్ట ధర రూ.767గా నిర్ణయించిందని, అంతకు మించి ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలంలో గ్లైఫోసైట్ అమ్మడాన్ని నిషేధించడం జరిగిందని, ఏ షాపులో గ్లైఫోసైట్ కనిపిస్తే లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక విత్తన రంగంలో నూతన సంస్కరణల కోసం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని మంత్రి తెలిపారు.