ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక చర్చ నిర్వహించారు మంత్రులు. సచివాలయంలోని కొండా సురేఖ కాన్ఫరెన్స్ హాల్ లో భద్రాచలం, వేములవాడ, బాసరా సరస్వతి అమ్మ వారి దేవాలయాల అభివృద్ధి పై మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ, సీతక్క, విప్ ఆది శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు.
అయితే ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీతక్క. ఆలయ విస్తరణ పనులతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచేలా పనులు వేగవంతం చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు. ఇక భక్తులకు ఇబ్బందులు లేకుండా, ఆలయ ప్రతిష్టత పెంచేలా ఆలయాన్ని అభివృద్ధి పరచాలని మంత్రి సీతక్క అన్నారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని సూచనలు చేసిన మంత్రి సీతక్క.. ఆలయంలో ప్రైవేట్ వ్యాపార ప్రకటనలు, బోర్డులపై నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ క్రమంలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ దసరా నవరాత్రి వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించారు మంత్రులు.