ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత డ్రామాలు ఆపాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి బాగా మాట్లాడుతున్నారని.. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణం కాదా..? అని నిలదీశారు. తెలంగాణలో ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు.
కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని.. ఆమె ముందుగా తెలంగాణలో మహిళలకు మేలు చేయాలని కేసిఆర్ పై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ సర్కార్ నిరుద్యోగులను, యువతను మోసం చేసిందని.. చదువుకునేందుకు స్కాలర్షిప్స్ కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో సారా ఏరులై పారుతోందని.. ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్ ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కేబినెట్ లో శాసనసభ్యులకు ఇచ్చిన టికెట్లలో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్నారు.