బీఆర్ఎస్​కు.. కాంగ్రెస్ అసలు పోటీయే కాదు : ఎమ్మెల్సీ కవిత

-

బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్​ను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను కాపీ కొట్టారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ వ్యవహారంపై స్పందించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ హామీలను కాపీ చేసే దుస్థితి దేశంలో ఏ పార్టీకి లేదని కవిత విమర్శించారు. తొమ్మిదన్నరేళ్ల బీఆర్ఎస్ సర్కార్‌ పాలనలో అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానానికి చేరిందని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం తీసుకువచ్చారని చెప్పాలని కవిత ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ అసలు పోటీయే కాదని అన్నారు. బీజేపీ 119 సీట్లలో డిపాజిట్‌ కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూసి ఆ రెండు పార్టీలకు దిమ్మతిరిగి పోయిందని కవిత వ్యాఖ్యానించారు. తమ మ్యానిఫెస్టో ఈ స్థాయిలో ఉంటుందని విపక్షాలు ఊహించలేదని పేర్కొన్నారు. మూడోసారి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించడం పక్కా అని కవిత ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news