‘రోజ్‌గార్‌ మేళా-2023’ కార్యక్రమంలో భద్రాద్రి యువకుడితో మోదీ ముచ్చట

-

తెలంగాణలోని భద్రాద్రి జిల్లా యువకుడికి ఓ అరుదైన అవకాశం లభించింది. అదేంటంటే.. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడే అవకాశం దొరికింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? ‘రోజ్‌గార్‌ మేళా-2023’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రధాని దిల్లీ నుంచి దేశవ్యాప్తంగా యువ ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖాముఖి నిర్వహించారు. ఇందులో పాల్గొనే అవకాశం తెలంగాణ నుంచి సుజాతనగర్‌ మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన కన్నమల్ల వంశీకృష్ణకు దక్కింది.

బీటెక్‌ పట్టభద్రుడైన ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలోని బల్లార్‌పూర్‌ కాలరీస్‌, ‘34 పిట్స్‌ మైన్‌’ జీఎం కార్యాలయంలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా పనిచేస్తున్నారు. ప్రధాని మాట్లాడుతూ ‘మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు ఎలా భావిస్తున్నారు?’ అని ప్రశ్నించారు.

వంశీకృష్ణ సమాధానమిస్తూ అమ్మానాన్నలు కూలి పనులకు వెళ్లి తనను చదివించారన్నారు.  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ సీటు కష్టపడి సంపాదించానన్నారు. 2021లో పట్టా పొందానని, గత ఏడాది జూన్‌లో ప్రముఖ బొగ్గు కంపెనీలో ఉద్యోగం దక్కిందన్నారు. ‘కర్మయోగి ప్లాట్‌ ఫాం’ను సద్వినియోగం చేసుకుని మీతో (ప్రధాని) మాట్లాడే అదృష్టం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news