గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. అనుకున్న దానికంటే ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. రెండు రోజుల క్రితం రాయలసీమకు రుతుపవనాలు తాకగా నిన్నటి నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా నేడు ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకాయి. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, గద్వాల్, నల్లగొండ జిల్లాలోకి ఈ రోజు మధ్యాహ్నం రుతుపవనాలు ప్రవేశించాయి.
దీంతో నాలుగు జిల్లాల్లో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసాయి. నిన్న మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు.