తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం వేడి రాజేస్తోంది. అధికార కాంగ్రెస్పై బీఆర్ఎస్, బీజేపీలు విరుచుకు పడుతుంటే.. పదేళ్లలో మీరు రాష్ట్రానీకిి ఏం చేశారంటూ కాంగ్రెస్ ఆ పార్టీలపై ధ్వజమెత్తుతోంది. ఈ మూడు పార్టీల నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయం హీటెక్కుతోంది. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకే అత్యధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లక్ష్మణ్ ఈ మేరకు మాట్లాడారు.
10 నుంచి 12 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. బీజేపీ అభ్యర్థులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. మా పార్టీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ అభ్యర్థులపై బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అన్న 24 గంటల్లోనే ప్రకాష్ గౌడ్ వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. బీజేపీని రెచ్చగొట్టేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు. నవంబరులో ఎన్నికలు వస్తాయంటున్న కేసీఆర్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, హరీశ్ రావు మాటలు విని ప్రజలు నవ్వుతున్నారు. అధికారం లేకుండా తండ్రీకొడుకులు ఉండలేకపోతున్నారు. అని లక్ష్మణ్ మండిపడ్డారు.