తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నారా రోహిత్ ?  ఈ గందరగోళం ఏంటి ?

-

తెలుగుదేశం పార్టీ లో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఏపీ తెలంగాణల్లో తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏపీలో కాస్త పర్వాలేదు  అనిపించుకున్నా, తెలంగాణలో మాత్రం ఉన్నా, లేనట్టుగా ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఇక నాయకులు ఎవరికి వారు వివిధ పార్టీల్లో సర్దుబాటు అయిపోగా, ఆ ప్రత్యామ్నాయం లేనివారు ఇంకా ఆ పార్టీ ని పట్టుకుని వేలాడుతున్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ టిడిపి లో ఎప్పటి నుంచో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి
 పేరుకు పార్టీ అక్కడ ఉన్నా, నాయకులు ఎవరూ యాక్టివ్ గా ఉండటం లేదు. ఆ పార్టీ తరఫున పెద్దగా కార్యక్రమాలు చేసింది ఏమీ లేదు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాస్త హడావుడి చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు హీరో నారా రోహిత్ కాబోతున్నారు అంటూ పెద్ద ప్రచారం ఇప్పుడు మొదలైంది. అసలు ఇంత అకస్మాత్తుగా నారా రోహిత్ పేరు తెరపైకి రావడానికి కారణం ఉంది. అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా, ఉదయం 11 గంటలకు తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల కోసం ఓ మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం తెలంగాణ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, విజయవంతం చేయాలని నారా రోహిత్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీంతో నారా రోహిత్ తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాబోతున్నాడు అంటూ అప్పుడే ప్రచారం మొదలైపోయింది.
ప్రస్తుతం తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.రమణ ఉన్నారు. అయితే ఆయనను ఆ పదవి నుంచి తప్పించి, వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని చాలాకాలంగా అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. చంద్రబాబు సైతం కొత్త వ్యక్తులకు పార్టీ బాధ్యతలు అప్పగించి నిరాశ నిస్పృహల్లో ఉన్న  టిడిపి క్యాడర్ కు మరింత ఉత్సాహం నింపే వ్యక్తులను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నారా రోహిత్ పేరు యాదృచ్చికంగా తెరపైకి వచ్చినా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అభిప్రాయం కూడా ఇదే అయి ఉండవచ్చు అనే ప్రచారము అప్పుడే మొదలయిపోయింది.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news