రాష్ట్రంలో వీధికుక్కలు సృష్టిస్తున్న బీభత్సానికి ఫుల్స్టాప్ పెట్టాలనే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే వీధికుక్కల స్వైరవిహారం.. దాడులను అరికట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వీధికుక్కలను పట్టుకుని తీసుకువెళ్తున్నారు. అయినా రోజూ ఏదో ఓ చోట ప్రజలపై కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందుకే దీనికి శాశ్వతంగా ముగింపు పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగానే కుక్కలను పట్టుకునేందుకు నేపాల్ బృందాలను తీసుకు వస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ నగరపాలక సంస్థలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేపాల్‌కు చెందిన నిపుణులు కుక్కలను పట్టుకోవడంలో నిష్ణాతులు. ప్రమాదకమైన జంతువులనూ బంధించగలరు.తక్కువ సమయంలో ఎక్కువ మూగ జీవాలను బంధించేందుకు తెలంగాణ సర్కార్ నేపాల్ బృందాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కుక్కలను చంపకుండా కేవలం వాటి సంతాన నియంత్రణతో పాటు కుక్క కాటు వంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టనున్నారు.