కొత్త రేషన్ కార్డు ( New Ration Card ) ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జులై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు ఆదేశాలు జారీ చేసారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం ఆదేశించారు. జులై 26 నుంచి 31వ తేది వరకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను సీఎం ఆదేశించారు.