తెలంగాణలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కనీసం ఇప్పుడైనా కేసీఆర్ సచివాలయానికి వెళ్తారా అని ప్రశ్నించారు. కొత్త సచివాలయం కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ మూడు నాలుగు నెలల పాటు ప్రతిరోజు సచివాలయానికి వస్తారా..? అని నిలదీశారు. కొత్త సచివాలయంలోనైనా పాలన బాగుండాలని కోరుకుంటున్నానని అన్నారు ఈటెల.
కెసిఆర్ పాలనలో 9 ఏళ్లుగా వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేయడానికి కొత్త సచివాలయం ఏర్పాటు చేశారని ఆరోపించారు ఈటెల రాజేందర్. కొత్త సచివాలయాన్ని తాను వ్యతిరేకించడం లేదు కానీ.. ఆయన పేరు కోసం, ప్రతిష్ట కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడో అందరికీ తెలుసు అన్నారు. 9 సంవత్సరాలుగా కేసీఆర్ ఏ మనిషిని కలవలేదని, ఏ అధికారిని కలవలేదని, కనీసం ఇకనుంచి అయినా కలుస్తారని ఆశిస్తున్నాను అన్నారు.