తమకు హాస్టల్ కేటాయించి సమస్యలు పరిష్కరించాలని సాక్షాత్తుర రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి చెప్పినా యాజమాన్యం స్పందించడం లేదని నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థినులు మరోసారి ఆందోళనకు దిగారు. నూతనంగా నిర్మించిన హాస్టల్లో పీజీ విద్యార్థినులకు మాత్రమే గదులు కేటాయించారని ఆరోపించారు. తమకు ఇప్పటికీ గదులు కేటాయించలేదని వాపోయారు.
దూర ప్రాంతం నుంచి వస్తోన్న తమకు వసతిగృహం సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల చేస్తున్న నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థినుల విషయమై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
“మహిళా హాస్టల్‌ను కొత్తగా నిర్మించారు. బయట ఉంటే మాకు ఇబ్బందులు ఎదురవుతాయని మేము హాస్టల్ కేటాయించాలని అడిగాం. అయిదు రోజులు సమయం ఇవ్వాలని ప్రిన్సిపల్ చెప్పారు. కానీ మాకు తెలియకుండా పీజీ విద్యార్థినులకు కేటాయించారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం.” -విద్యార్థినులు