తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు చేస్తోంది. ఇవాళ ఉదయం నుంచే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో అలాగే, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు చేస్తోంది.
మల్లా రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు చేస్తున్న తరుణంలో తెలంగాణ మంత్రులు అత్యవసర భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేల భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సంస్థల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. టిఆర్ఎస్ నేతలపై ఐటి, ఈడీ దాడులను ముందే ఊహించామని.. ఇలాంటి తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు మంత్రి తలసాని.
టిఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం సరికాదన్నారు. దేశంలో ఇలాంటి విధానాలను ఎప్పుడూ చూడలేదన్న తలసాని.. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ నేతలపై జరుగుతున్న పరిణామాలని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తామన్నారు. ఈరోజు వ్యవస్థలు మీ చేతిలో ఉండొచ్చు.. రేపు మా చేతిలో ఉండొచ్చన్నారు. తర్వాత ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూస్తారని అన్నారు మంత్రి తలసాని.