యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులను జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ గతకొద్ది రోజులుగా విచారిస్తోంది. అందులో భాగంగా నిన్న బీఆర్కే భవన్లో ఉన్న తమ కార్యాలయంలో ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, మాజీ ట్రాన్స్ – జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును పలు అంశాలపై కమిషన్ విచారించింది.
అయితే తాజాగా జస్టిస్ నరసింహ రెడ్డి పలు ఆసక్తికర విషయాలను మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు సమయం కోరాడు కేసీఆర్. జూన్ 15 లోపు మీ వివరణ ఇవ్వాలని ఆదేశించాం. ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు ఇచ్చాము. అందరూ వివరణ ఇచ్చారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తి కరంగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి.