ప్రభుత్వ భూముల అమ్మకపు ప్రక్రియ షురూ

తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకపు ప్రక్రియ ప్రారంభమయింది. తొలి విడతలో ప్రభుత్వం అమ్మాలనుకున్న భూములకు సంబంధించి నోటిఫికేషన్ శనివారం జారీ అయింది. అమ్మకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… తాజాగా ప్రకటన కూడా విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా కోకాపేటలోని భూములతో పాటు ఖానామెట్‌లోని భూములను ప్రభుత్వం విక్రయించాలని నిర్ణయించింది.

 

ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 64.93 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను వేలం వేయనున్నారు. వేలం వేయనున్న ప్లాట్ల వివరాలను పరిశీలిస్తే కోకాపేటలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్‌ లేఅవుట్‌లోని 7 ప్లాట్లతో పాటు గోల్డెన్‌ మైల్‌ లేఅవుట్‌లోని ఒక ప్లాట్‌ అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఖానామెట్‌లో టీఎస్‌ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఫ్లాట్ల వేలం కోసం తెలంగాణ ప్రభుత్వం జూన్ నెల 15న నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. జూన్ 25న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించనుండగా… రిజిస్ట్రేషన్‌కు జులై 13 చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక జులై 15న ఈ-వేలం నిర్వహించనున్నారు.కాగా నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. అయితే ప్రభుత్వ భూములు విక్రయించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.