అటవీ ఉద్యోగ సంఘాలతో పీసీసీఎఫ్ డోబ్రియాల్ సమావేశం

వివిధ అటవీ ఉద్యోగ సంఘాలతో పీసీసీఎఫ్ డోబ్రియాల్ సమావేశమయ్యారు. కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య దృష్ట్యా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా చూడాలని డోబ్రియాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించిన తీరుకు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది రక్షణకు ఆయుధాలు ఇచ్చే ప్రతిపాదన పరిష్కరించాలని కోరారు.

మరోవైపు ప్రత్యేక ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని డోబ్రియాల్‌ను అటవీ ఉద్యోగ సంఘాలు కోరాయి. అటవీ శాఖలో ఖాళీల భర్తీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించాలని పీసీసీఎఫ్‌కు విజ్ఞప్తి చేశాయి. రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం పెంచాలని విన్నవించాయి. అన్ని బీట్లలో అటవీ సరిహద్దులు గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని అటవీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గొత్తికోయలు పోడు సాగుదారుల కిందకు రారని స్పష్టం చేశారు. గొత్తికోయలను పూర్తిగా అటవీ ఆక్రమణదారులుగా గుర్తించాలని సర్కార్‌కు విన్నవించారు.