మోసం చేసిన కాంగ్రెస్ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా సంగారెడ్డిలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ.4వేల పింఛన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ కి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం కేసీఆర్ కి బాగా తెలుసు.. రైతులు కేసీఆర్ ని గుర్తుకు చేసుకుంటున్నారని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలో సమయానికి రైతుబందు వచ్చింది. కరోనా వచ్చినా సకాలంలో రైతుబంధు అందించాడు కేసీఆర్. పంట కోతకు వచ్చినా రైతుబంధు రాని పరిస్థితి నెలకొంది. వడ్లకు, మొక్కలకు రూ.500 బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. 500 బోనస్ ఇవ్వకుండా మీరు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది అని నిలదీయాలని సూచించారు.
నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేటా ముంచింది. రూ.4వేల నిరుద్యోగ బృతి కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ అది నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల పై కేసులు పెట్టుడు.. నాయకులను కొనుడు కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. ప్రతిపక్ష నాయకులను ఎలా బెదిరించాలి..? వారిని ఎలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారు. కార్యకర్తలతో హంగామా అవసరం లేదు.. మహాలక్ష్మి పేరు మీద కాంగ్రెస్ చేసిన మహా మోసాన్ని గుర్తుకు చేయండి అని గుర్తుకు చేశారు హరీశ్ రావు. సంగారెడ్డిలో చింత ప్రభాకర్ ని గెలిపించారు.. ఇప్పుడు మెదక్ లో వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాటం చెప్పాలి.