తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ సంస్థ పెప్సికో ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం సంస్థ ఉపాధ్యక్షులు రాబర్డో అజేవేడో ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా పెప్సీకో నిర్వహిస్తున్న గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్‌ను మరింతగా విస్తరించి కార్యకలాపాలను రెట్టింపు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ లో ఉన్న బిజినెస్ సర్వీస్ సెంటర్ ను స్వల్ప కాలంలోనే భారీగా విస్తరించామని, ఇందుకు నగరంలో ఉన్న అత్యుత్తమ మానవ వనరులే ప్రధాన కారణమని మంత్రి కేటీఆర్‌కు రాబర్టో తెలిపారు. పెప్సీకో అంతర్జాతీయ కార్యకలాపాలకు అవసరమైన సేవలను హైదరాబాద్ కేంద్రం నుంచే అందిస్తామని అన్నారు. మానవ వనరుల డిజిటలైజేషన్, ఆర్థిక సేవల వంటి ప్రధానమైన అంశాలపై ఈ కేంద్రం పనిచేస్తుందని చెప్పారు.
గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ విస్తరణతో పాటు రాష్ట్రంలో పెప్సీకో ఇతర విభాగాల విస్తరణ అవకాశాలపైన కేటీఆర్, రాబర్టో చర్చించారు. పెప్సికో నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు.