గ్రూపు 1 పరీక్ష రద్దు చేయాలని కోర్టులో పిటిషన్

-

గ్రూపు 1 ఎగ్జామ్ రద్దు చేయాలని ఆదిలాబాద్ కు చెందిన బి ప్రశాంత్ మరో ముగ్గురు వ్యక్తులు రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. దీనిపై జస్టిస్ పి. మాధవీ దేవీ విచారణ చేపట్టారు. ప్రిలిమ్స్ పరీక్షలో బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదని హై కోర్టు  టీఎస్పీఎస్సీని ప్రశ్నించింది. ఓఎంఆర్ షీట్ లో ఫోటో, హాల్ టికెట్ నెంబర్ లేకుండా పరీక్ష నిర్వహించడంపై నిలదీసింది. గత అక్టోబర్ లో పరీక్ష నిర్వహించినపుడు చేసిన విధానాన్ని ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదని అడిగింది.

ఒకరు బదులు మరొకరు పరీక్ష రాయకుండా అడ్డుకునేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేేదని ప్రశ్నించింది. కోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కొన్ని ప్రశ్నలు అడిగింది. హాల్ టికెట్ నెంబర్, ఫోటో లేకుండా ఓఎంఆర్ షీట్ ఎలా జారీ చేశారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఖర్చులు లెక్కిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

బయోమెట్రిక్ తీసుకోలేదని ఓఎంఆర్ షీట్ లో హాల్ టికెట్ నెంబర్ లేదని దీని వల్ల గ్రూప్ 1 ఫ్రిలిమ్స్ ఎగ్జామ్  రద్దు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే పరీక్ష నిర్వహణలో తప్పు జరిగే అవకాశం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది అన్నారు. ఇన్విజిలేటర్ వద్ద నామినల్ రోల్ ఉంటుందన్నారు. అందులో అభ్యర్థి ఫొటోతో పాటు హాల్ టికెట్ నెంబర్ ఉంటుందని వివరించారు. ఆధార్ కార్డు, ఓటరు కార్డు లాంటి గుర్తింపు కార్డులను చూశాకే అభ్యర్థులను పరీక్షా సెంటర్ లోకి అనుమతించామని తెలిపారు.

ఓఎంఆర్ షీట్ లో ప్రశ్నాపత్రం కోడ్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసేలా ఉందని తెలిపారు. బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలంటే దాదాపు రూ. 15 కోట్లు అవసరమవుతాయని అన్నారు. అయితే హై కోర్టు దీనిపై స్పందిస్తూ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి గానీ ఖర్చులను లెక్కెస్తే ఎలా అని ప్రశ్నించింది. పరీక్ష రాసే అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ పై ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news