ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఎట్టకేలకు అధికారికంగా ఖరారైంది. జులై 8న మోదీ రాష్ట్రానికి రానున్నారు. తొలుత జులై 12న ప్రధాని పర్యటన ఉండేలా నిర్ణయించినా నాలుగు రోజులు ముందుకు మారింది. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ తయారీ, పీరియాడికల్ ఓవర్‌హాలింగ్(పీఓహెచ్) వర్క్‌షాప్‌నకు, మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో జులై 8న హైదరాబాద్‌లో జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం వాయిదా పడింది. బహిరంగ సభ ఏర్పాట్లపై వరంగల్ జిల్లా నేతలతో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్చించారు. సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. వరంగల్‌కు ప్రధాని మోదీ మొదటిసారి వస్తున్న నేపథ్యంలో పూర్వపు వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాను లక్ష్యంగా చేసుకుని సభ నిర్వహించనున్నారు.