మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా 11.20 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పలు కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు చేరుకోవడంతో పోలింగ్ కాస్త ఆలస్యమవుతోంది.
మరోవైపు పలు ప్రాంతాల్లో ఈవీలు మొరాయిస్తున్నాయి. చండూరు మండలం కొండాపురంలోని 178 పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ నిలిచిపోయింది. ఈవీఎం మొరాయింపుతో అరగంట నుంచి పోలింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు మండలంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి పరిశీలించారు. కొంపల్లిలోని 145వ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. 25 ఓట్లు పోలయ్యాక సాంకేతిక సమస్య తలెత్తింది. సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెరువులోనూ ఇదే సమస్య ఎదురైంది.