బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ రుణమాఫీ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని పేర్కొన్నారు. బీజేపీ ఏం చేసిన ప్రజాస్వామ్య పద్దతిలో ఉంటుందన్న ఆయన, లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుందని ప్రశ్నించారు. రుణమాఫీ అయిన అర్హుల జాబితాను వెంటనే బయటపెట్టాలన్నారు.