బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లితో పాటు ఆధిపత్య పోరు రోజు రోజుకు రగులుతోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులకు టికెట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చాలా నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహావేశాలు.. ఇప్పుడు కట్టలు తెంచుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికొస్తే.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యవహార శైలిపై.. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ బహిరంగంగా చేసిన విమర్శలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిత్యం వహిస్తూ.. మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారంటూ వైరా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా నియోజకవర్గంలో దళితబంధు లబ్దిదారుల విషయంలో జోక్యం చేసుకుంటున్నారని.. ఆయనకు తన నియోజకవర్గంలో ఏం పని అంటూ.. నిలదీశారు ఎమ్మెల్యే రాములు నాయక్. గతంలో మైనంపల్లి హన్మంతరావు కూడా మంత్రి హరీశ్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.