తెలంగాణలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో సాగర్ అధికారులు డ్యామ్ క్రస్ట్ గేట్లను మూసివేసి నీటి విడుదలను ఆపివేశారు. సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో భారీగా రావడంతో ఈనెల 5 నుంచి గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలడం ప్రారంభించారు. బుధవారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగించగా.. ఎగువ నుంచి వరద ఉధృతి రావడం తగ్గడంతో క్రస్ట్ గేట్లను బుధవారం 11.40 గంటల ప్రాంతంలో మూసివేశారు.
ఒకవేళ ఎగువ ప్రాంతం నుంచి మళ్లీ భారీగా వరద నీరు వచ్చినట్లు అయితే మరోసారి గేట్లను ఎత్తినీటిని దిగువకు విడుదల చేస్తామన్నారు.ప్రస్తుతం సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 588.80 అడుగుల మేర నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 312.50 టీఎంసీలకు గాను ప్రస్తుతం 305.46 టీఎంసీలు ఉందని తెలిపారు.