అకాల వర్షాల వల్ల ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకు వరద ప్రవాహం పెరిగింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15000 క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చి చేరింది. బుడమేరుకు భారీగా వరద వచ్చి చేరడంతో విజయవాడలోని 16 డివిజన్లు ముంపుకు గురయ్యాయి. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు.
మొత్తం మూడు చోట్ల గండ్లు పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో యుద్ధప్రాతిపాదికన పనులను చేపట్టారు. 200 మీటర్ల మేర గండ్లు పడడంతో కవులూరు, ఈలప్రోలు, రాయలపాడు, సింగినగర్ మీద బుడమేరు విరుచుకుపడింది. ప్రస్తుతం వరద ఉధృతి కాస్త తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు గండ్లను పూడుస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దీంతో బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గుర్తించి నారా లోకేష్ ఆరా తీశారు. గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించడానికి నారా లోకేష్ స్వయంగా బుడమేరు వద్దకు బయలుదేరి వెళ్లారు. ప్రజలంతా అప్రమంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నారా లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు వరద ముంపు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.