రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1955లో ప్రచురించిన భాషా రాష్ట్రాలపై ఆలోచనలు అనే పుస్తకంలో ఉత్తరాది – దక్షిణ విభజనను తొలగించడానికి 11వ అధ్యాయంలో హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలని చెప్పారు. అయితే హైదరాబాద్ ని దేశానికి రెండవ రాజధానిగా పేర్కొంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది అంత ఆషామాషీ అంశం కాదన్నారు.
హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం రాష్ట్రానికి చెందాలా..? కేంద్రానికి చెందాలా..? అధికారాల విషయంలోనూ విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందని అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై స్పష్టత కోసం సంబంధిత మేధావులతో అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దేశానికి హైదరాబాద్ రెండవ రాజధానిగా ప్రతిపాదన వస్తే పార్టీలో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.