TSPSC పేపర్ లీకేజీకి ఐటీ శాఖే కారణం : రేవంత్ రెడ్డి

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. పేపర్ లీకేజీకి ఐటీ శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు.  గవర్నర్‌ తనకున్న విచక్షణాధికారాలను వినియోగించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. సిట్‌ విచారణను ఎదుర్కోవాల్సిన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శి, సెక్షన్‌ ఆఫీసర్‌ను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

‘‘టీఎస్‌పీఎస్సీలో జరిగిన అవకతవకలకు కేటీఆర్‌ మంత్రిగా ఉన్న ఐటీ శాఖే కారణం. ఆ శాఖ పరిధిలో తప్పిదాలు జరగడంతో లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పారదర్శకత లోపించడంతో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్రమాలకు పాల్పడి ప్రశ్నపత్రాలను కోట్లాది రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 317 ప్రకారం టీఎస్‌పీఎస్సీలో బాధ్యులైన వ్యక్తులను గవర్నర్‌ సస్పెండ్‌ చేయొచ్చు. తద్వారా పారదర్శకమైన విచారణ జరిగేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్నానని.. న్యాయ సలహాతో చర్యలు తీసుకుంటానని గవర్నర్‌ మాకు హామీ ఇచ్చారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.