సామాన్యులకు షాక్. మొన్నటిదాకా కూరగాయలు, పప్పుల ధరలు పెరిగి మధ్యతరగతి వాళ్ల నడ్డివిరిచాయి. ఇక ఇప్పుడు బియ్యం ధరలు కూడా భగ్గుమంటున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. బియ్యం కొనుగోలు చేయాలంటే సామాన్యులు హడలిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో చాలామంది రేషన్ బియ్యాన్ని బయట మార్కెట్‌లో విక్రయించి సన్నాలు కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం రేట్లు పెరగడంతో రేషన్ బియ్యాన్నే వినియోగించుకుంటున్నారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో క్వింటా బియ్యం ధర సగటున రూ.1000-1500 వరకు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. నగరంలో గతంలో కిలో రూ.50 చొప్పున విక్రయించే సన్న బియ్యాన్ని ప్రస్తుతం రూ.65కి అమ్ముతున్నట్లు చెప్పారు. ఇక మేలు రకం రూ.70పైనే ఉందని వెల్లడించారు. సోనామసూరి, బీపీటీ, హెచ్‌ఎంటీ వంటి సన్న రకాలు క్వింటాలు బియ్యం ధర గతంలో రూ.3,500-4,000 మధ్య ఉండగా ప్రస్తుతం వాటిని రూ.5,000కు విక్రయిస్తున్నారు. క్వింటాలు పాత బియ్యం ధర రూ.7,500గా ఉంది. పలు రాష్ట్రాల్లో అతివృష్టి, అనావృష్టితో ధాన్యం దిగుబడులు తగ్గి, ధరలు పెరిగాయని రైస్ మిల్లర్ల ప్రతినిధులు అంటున్నారు.