రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ ఆమెను ర్యాగింగ్ చేసినట్లు పోలీసుల ఎదుట ఎట్టకేలకు ఒప్పుకొన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 22న ప్రీతి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్లడం, తర్వాత నిమ్స్‌కు తరలించగా.. ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ ర్యాగింగ్ కారణమని పోలీసులు తెలిపినా.. అతడు ఖండిస్తూ వచ్చాడు. తాను సీనియర్‌ను కనుక ప్రీతి వృత్తి రీత్యా పొరపాట్లు చేయడం వల్ల తప్పని చెప్పానే కానీ.. అది ర్యాగింగ్ కాదని వాదించాడు. కానీ పోలీసులు వాట్సాప్ చాటింగ్‌లు బయటకు తీసి సైఫ్ ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారించి అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోలీసులు 4 రోజులపాటు జరిపిన విచారణలో ఆధారాలు చూపించి సైఫ్‌ను ప్రశ్నించగా, తాను ర్యాగింగ్‌కు పాల్పడ్డది నిజమేనని, చాటింగ్ కూడా చేశానని సైఫ్ అంగీకరించినట్లు సమాచారం.