దిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. ఈ నెల 26వ తేదీ వరకు కవితను విచారణకు పిలవకూడదని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. కవితకు సమన్ల జారీని 10 రోజులు వాయిదా వేస్తామని ఈడీ శుక్రవారం రోజున సుప్రీంకోర్టుకు తెలిపింది. విచారణకు హాజరుకావాలంటూ ఈడీ జారీచేసిన సమన్లు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) ఎస్‌వీ రాజు న్యాయస్థానానికి ఈ మేరకు హామీ ఇచ్చారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొన్న సుప్రీం కోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఏ ఉత్తర్వులు ఇచ్చేదీ అప్పుడు చెబుతామని పేర్కొంది. ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం శుక్రవారం కవిత దిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉండగా.. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఆమె హాజరు కాలేదు.