సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగుతోంది. బోనాల పండుగలో భాగంగా ఇవాళ రంగం కార్యక్రమం జరిగింది. జోగిని స్వర్ణలత తెలంగాణ ప్రజల భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రంగం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. కాసేపట్లో పోతరాజు విన్యాసాలు ఉంటాయని.. ఆ తర్వాత ఘటోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. బోనాలకు సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు చెప్పారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపు ఉంటుందని వివరించారు.
ఈ బోనాల సంబురాల్లో అమ్మవారిని లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మంత్రి తలసాని చెప్పారు. ఆదివారం రాత్రంతా దర్శనాలు జరిగాయని తెలిపారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇతర మంత్రులు.. వివిధ పార్టీల నేతలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు. రంగంలో భాగంగా.. అమ్మవారు భవిష్యవాణిలో బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషకరమని తలసాని హర్షం వ్యక్తం చేశారు.