ఈ సారి తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు.. ఆ శాఖలకు భారీగా నిధులు!

తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఇవాళ ఉదయం 10:30కి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి మండలి చర్చించి ఆమోదం తెలపనుంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది బారాస ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

మంత్రివర్గంలో చర్చించి ఏ రంగానికి ఎంత కేటాయించాలనేది నిర్ణయించుకున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ.3లక్షల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. రైతన్నకు దన్నుగా నిలిచే పథకాలకు, సంక్షేమ రంగాలకు, గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. పంట రుణమాఫీకి బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. సాగునీటి రంగానికి సుమారు పదివేల కోట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. రుణాల రూపేనా మరో పదివేల కోట్లు సేకరించనున్నట్లు తెలిసింది.