తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఈరోజు మధ్యాహ్నం కేబినెట్ భేటీ అవుతుంది. ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కేబినెట్లో చర్చించి ఖరారు చేయనున్నారు.
ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం… ఇళ్ల స్థలాలు, క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీ దిశగా కసరత్తు చేస్తోంది. అవకాశం ఉన్నచోట పట్టాల పంపిణీ కోసం అనువైన స్థలాలు, వాటి వివరాలను గుర్తించారు. దీంతో పట్టాల పంపిణీకి మంత్రివర్గంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 58, 59 ఉత్తర్వుల కింద క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామకంఠం సహా ఇతరత్రా ఇళ్ల స్థలాల అంశాలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.