ఓటు హక్కు లేదని వాళ్లను పట్టించుకోవడంలేదా.. ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

-

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. జిల్లాల వారీగా మెంటల్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌)ను ఏర్పాటు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారికి ఓటు హక్కు ఉండదని, అందువల్ల వారి గురించి పట్టించుకోనట్లుందని వ్యాఖ్యానించింది. ఒకవేళ వారికి ఓటు హక్కు ఉండి ఉంటే అన్ని సౌకర్యాలు కల్పించి ఉండేవారంది.

సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం-2017 నిబంధనలు ఏం చెబుతున్నాయో వివరాలు సమర్పించాలంటూ పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈనెల 13వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై వివరాలు ఇవ్వాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకూ సూచించింది.

మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఇంటిగ్రేటెడ్‌ న్యూ లైఫ్‌ సొసైటీ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ వ్యవస్థాపకుడు ఎం.మనోహర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి నిబంధనలేమిటని ప్రశ్నించగా.. గడువు ఇవ్వాలని న్యాయవాది కోరడంతో విచారణను వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news