తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించి చాలా రోజులవుతున్నా ఇప్పటికీ చెప్పుకోదగ్గ వర్షాలు పడటం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.
ఇవాళ (జూన్ 27వ తేదీ) ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మేడ్చల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు (జూన్ 28వ తేదీ) వనపర్తి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.