ఏపీనీ ఆపేసిన కేసీఆర్… కారణం ఇదే!

కరోనా విషయంలో ముందు నుంచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు! ఇతర రాష్ట్రాలతో.. గట్టిగా మాట్లాడితే కేంద్రంతో కూడా సంబందం లేకుండా… తెలంగాణలో కరోనా వ్యాప్తికి తనదైన శైలిలో నిర్ణయ్యాలు తీసుకుంటున్నారు.. ప్రకటనలు చేస్తున్నారు! ఈ క్రమంలోనే… తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా… దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్ లతోపాటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే రాకపోకలపై నిషేధం విధించారు.

అవును… రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే మరో కఠిన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా అత్యధిక కరోనా కేసులు ఉన్న గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చేవారందరికీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పాసులు జారీ నిలిపేయడంతో పాటు… తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఎలాంటి పాసులూ జారీ చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

అయితే… మహారాష్ట్ర, గుజరాత్ లలో అంటే కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి నిషేధించారు అని సరిపెట్టుకోవచ్చు కానీ… ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. మరణాల రేటు కూడా తక్కువగా ఉన్నా కూడా అవిభక్త కవలల్లా కలిసుండే ఏపీ నుంచి కూడా రాకపోకలు నిషేదించడం గమనార్హం! దీనికి ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానం… కర్నూలు – గుంటూరు జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండడం వల్లే ఏపీ నుంచి కూడా రాకపోకలను నిషేధించాల్సి వచ్చిందని అంట!

కాగా… దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన సుమారు 80వేల మంది తెలంగాణ వాసులు ఇప్పటికే తెలంగాణకు చేరుకున్నారు. వారికి పరీక్షలు చేసి కరోనా ఉంటే మాత్రం క్వారంటైన్ కు… లేని పక్షంలో హోం క్వారంటైన్ ముద్ర వేసి ఇళ్లకు పంపిస్తున్నారట! ఈ లెక్కన చూసుకుంటే… ఏపీ వాసులు ఇప్పట్లో భాగ్యనగరం చూసే అవకాశాలు లేనట్లేనేమో!!