రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం తొమ్మది నుంచే సూర్యుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక మిట్ట మధ్యాహ్నం బయట కాలు పెట్టాలంటే జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఈ నెల చివరి వరకు 45 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మే నెలలో కొన్ని చోట్ల 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.
సోమవారం రోజున 18 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. 7 జిల్లాల్లో పలుచోట్ల 44 డిగ్రీలకు పైనే రికార్డయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44.8 డిగ్రీలు, నల్లగొండ జిల్లా కట్టంగూర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగలో 44.7, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4, జగిత్యాల జిల్లా గోదూరులో 44.3, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చరించారు.