కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ ఇవాళ వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో భాగంగా తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే సంజయ్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కోడి గుడ్లతో దాడికి చేశారు. ఈ దాడులకు పాల్పడిందని కాంగ్రెస్ కార్యకర్తలేనని బండి సంజయ్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుడ్ల దాడి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గుడ్లు విసిరిన వారి గుర్తించాలని డిమాండ్ చేశారు. కోడిగుడ్లు విసిరేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గత రెండు రోజుల నుంచి ఎంపీ బండి సంజయ్, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.