కెసిఆర్ కుటుంబం తెలంగాణలో దోచుకుంటున్న డబ్బులు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పేరు మీద పంపిణీ చేస్తుందని ఆరోపించారు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలోని క్లాక్ టవర్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
రైతులకు రుణమాఫీ జరగలేదని, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయిందని మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి లిక్కర్ తెలంగాణ, అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో కేసిఆర్ 10 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విరుచుకుపడ్డారు. ఈ మూడు పార్టీల డిఎన్ఏ ఒక్కటేనని అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో మార్పు రావలసిన అవసరం ఉందన్నారు.