ఈనెల మొదటి వారంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సర్వసభ్య సమావేశం రసాబాసగా మారిన విషయం తెలిసిందే. బిజెపి కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో జిహెచ్ఎంసి అధికారులు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. వాటర్ బోర్డ్ అధికారులు, జిహెచ్ఎంసి జోనల్ అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. విపక్ష సభ్యుల తీరుతో సమావేశాన్ని బాయికాట్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే జిహెచ్ఎంసి చరిత్రలో అధికారులు సమావేశాన్ని బాయ్కాట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అయితే సమస్యలు చర్చించకుండానే జిహెచ్ఎంసి సమావేశాన్ని బాయికాట్ చేసినందుకు అధికారులపై నేడు గవర్నర్ తమిళిసై కి ఫిర్యాదు చేశారు బిజెపి కార్పొరేటర్లు. గవర్నర్ తో భేటీ అనంతరం బిజెపి కార్పొరేటర్లు మాట్లాడుతూ.. వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరామన్నారు. సంబంధిత అధికారులను పిలిచి చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు గవర్నర్. గ్రేటర్ లో ఇబ్బందులపై కౌన్సిల్లో మాట్లాడదాం అంటే సమావేశాలు సరిగా నిర్వహించడం లేదని ఆరోపించారు కార్పొరేటర్లు. అధికారులు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కార్పోరేటర్లను అవమానపరిచారని మండిపడ్డారు.