కాళేశ్వరం 22వ ప్యాకేజీలో మినీ జలాశయాలు

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథఖం. ఈ పథకంలో 22వ ప్యాకేజీ కింద మూడు మినీ జలాశయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మోతె, గాంధారి, కామారెడ్డి శివారుల్లో 4 టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది.

Kaleswaram project

 

21వ ప్యాకేజీలోని మంచిప్ప కొండెం చెరువు నుంచి శ్రీరాంసాగర్‌ నీటిని కొత్తగా నిర్మించనున్న 3 జలాశయాలకు అందించనున్నారు. గతంలో మోతె జలాశయాన్ని 1.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని భావించగా.. దీని సామర్థ్యం 2 టీఎంసీలకు పెంచనున్నారు. గాంధారి మండలంలో కాటెవాడి జలాశయం 0.50 టీఎంసీ, కామారెడ్డి మండల పరిధిలో తిమ్మక్కపల్లి జలాశయం 1.50 టీఎంసీలతో నిర్మించనున్నారు.

ఈ మూడింటి కింద 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలుగా ప్రధాన పనులతో పాటు పిల్ల కాలువలకు సంబంధించిన మ్యాప్‌లను ముందుగానే రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుని టెండర్లు పిలిచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.