తెలంగాణ రాష్ట్ర కరోనా వైరస్ బులిటెన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే.. కొంత వరకు తగ్గాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ 51,518 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీనిలో 569 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.
అలాగే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కూడా సంభవించలేదు. దీంతో చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో ఒక్క రోజు కరోనా మరణాలు లేవు. అలాగే రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో 2,098 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో 8,379 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు కూడా థర్డ్ వేవ్ తర్వాత మొదటి సారి 10 వేల దిగువకు వచ్చాయి. ప్రతి రోజు పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువ గా ఉండటంతో పాటు రికవరీ రేటు భారీగా ఉండటంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.